ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు శుభ‌వార్త -సీఎం

హైద‌రాబాద్ః నూత‌న ఏడాది కానుక‌గా రాష్ట్రంలోని అన్ని రకాల ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు వేత‌నాలు పెంచాల‌ని, ఉద్యోగ విర‌మ‌ణ వ‌య‌స్సును పెంచాల‌ని అదేవిధంగా అన్ని శాఖ‌ల్లో ఉద్యోగాల భ‌ర్తీ ప్రక్రియ ప్రారంభించాల‌ని ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్ రావు నిర్ణ‌యించారు. ప్ర‌భుత్వ ఉద్యోగులు,గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు, వ‌ర్క్ చార్డ‌డ్ ఉద్యోగులు, డెయిలీ వైజ్ ఉద్యోగులు, పుల్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఆశ వ‌ర్క‌ర్లు, హోంగార్డులు, అంగ‌న్‌వాడీ వ‌ర్క‌ర్లు , విద్యావ‌లంటీర్లు,సెర్ప్ ఉద్యోగులు ,గౌర‌వ‌వేతనాలు అందుకుంటున్నవారు, పెన్ష‌న‌ర్లు ఇలా అంద‌రికీ ప్ర‌యోజ‌నం క‌లిగేలా వేత‌నాల పెంపు చేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించారు.అన్ని ర‌కాల ఉద్యోగులు క‌లిపి తెలంగాణ 9,36,976 మంది ఉంటారని, అంద‌రికీ వేత‌నాల పెంపు వ‌ర్తిస్తుంద‌ని సీఎం చెప్పారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌తో పాటు త‌క్కువ వేత‌నాలు క‌లిగిన ఉద్యోగులున్న ఆర్టీసీలో కూడా వేత‌నాల‌ను పెంచాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు సీఎం తెలిపారు. అస‌వ‌ర‌మైతే వేత‌నాల పెంపువ‌ల్ల ఆర్టీసీపై ప‌డే భారాన్ని ప్ర‌భుత్వం భ‌రిస్తుంది. సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. వేతనాల పెంపుతో పాటు ఉద్యోగ విర‌మ‌ణ వ‌య‌స్సు పెంపు, ప‌దోన్న‌తులు ఇవ్వ‌డం ,అవ‌స‌ర‌మైన బ‌దిలీలు చేయ‌డం , స‌ర‌ళ‌త‌ర‌మైన స‌ర్వీసు నిబంధ‌న‌ల రూప‌క‌ల్ప‌న రిటైర్ అయ్యే రోజే ఉద్యోగుల‌కు అన్ని ర‌కాల ప్ర‌యోజ‌నాలు అందించి గౌర‌వంగా వీడ్కోలు ప‌ల‌క‌డం, కారుణ్య నియామ‌కాల‌న్నింటినీ చేప‌ట్ట‌డం లాంటి ఉద్యోగ సంబంధ అంశాల‌న్నింటినీ ఫిబ్ర‌వ‌రి లోగా సంపూర్ణంగా ప‌రిష్క‌రించ‌నున్న‌ట్లు సీఎం వెల్ల‌డించారు.

ఫిబ్ర‌వ‌రి నుండి ఉద్యోగ నియామ‌కాల ప్రక్రియ‌…
అన్నిశాఖ‌ల్లో ఖాళీల‌ను గుర్తించి ఫిబ్ర‌వ‌రి నుండి ఉద్యోగ నియామ‌కాల ప్ర‌క్రియ‌ను చేప‌ట్ట‌నున్న‌ట్లు సీఎం ప్ర‌క‌టించారు. ఈ అంశాల‌న్నింటిపై అధ్య‌యనం చేయ‌డానికి , ఉద్యోగ సంఘాల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డానికి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేష్‌కుమార్ అధ్య‌క్షుడిగా ఆర్థికశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావు, నీటిపారుద‌ల‌శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి ర‌జ‌త్‌కుమార్ స‌భ్యులుగా త్రిస‌భ్య అధికారుల సంఘాన్ని ముఖ్య‌మంత్రి నియ‌మించారు. ఈ క‌మిటీ జ‌న‌వ‌రి మొద‌టి వారంలో వేత‌న స‌వ‌ర‌ణ సంఘం నుండి అందిన నివేదిక‌ను అధ్య‌య‌నం చేస్తుంది. రెండోవారంలో ఉద్యోగ సంఘాల‌తో స‌మావేశం అవుతుంది. వేత‌న స‌వ‌ర‌ణ ఎంత చేయాలి? ఉద్యోగుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సును ఎంత‌కు పెంచాలి?
స‌ర్వీసు నిబంధ‌న‌లు ఎలా రూపొందించాలి? ప‌దోన్న‌తుల‌కు అనుస‌రిచాల్సిన మార్గ‌మేమిటి? జోన‌ల్ విధానంలో ప్ర‌స్తుతం ఉన్న న్యాయ‌ప‌ర‌మైన చిక్కుల‌ను అధిగ‌మించే వ్యూహ‌మేమిటీ? త‌దిత‌ర అంశాల‌పై ఈ క‌మిటీ ప్ర‌భుత్వానికి సూచ‌న‌లు చేస్తుంది. అనంత‌రం క్యాబినెట్ స‌మావేశ‌మై తుది నిర్ణ‌యం తీసుకుంటుంద‌న్నారు.

అన్ని స్థాయిల్లోని ఉద్యోగుల‌ వేత‌నాల పెంపుకు నిర్ణ‌యం..
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర ఎంతో గొప్పది. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణ ప్రాంత ఉద్యోగులు టీఎన్జీవో పేరుతో తెలంగాణ అస్తిత్వాన్ని గొప్పగా నిలుపుకున్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తెలంగాణ ఖచ్చితంగా ధనిక రాష్ట్రం అవుతుందని అంచనా వేశాం. అప్పుడు ప్రభుత్వానికి, ప్రజలకు సేవలందిస్తున్న ఉద్యోగులకు మంచి వేతనాలు ఇవ్వవచ్చని భావించాం. అనుకున్నట్టుగానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ ధనిక రాష్ట్రంగా మారింది. రైతుల కోసం, పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఉద్యోగుల సంక్షేమం కోసం కూడా ఎన్నో చర్యలు తీసుకుంటున్నది. తెలంగాణ ఏర్పడిన వెంటనే ఉద్యోగులకు 42 శాతం ఫిట్ మెంట్ తో వేతనాలు పెంచింది. ఉద్యోగులు, పెన్షనర్లతోపాటు అన్ని ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు, కాంట్రాక్టు ఉద్యోగులకు, తక్కువ వేతనాలతో పనిచేస్తున్న ఉద్యోగులకు, మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలు పెంచింది. ఇప్పుడు మరోసారి వీరందరికీ వేతనాలు పెంచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికున్న ఆర్ధిక పరిమితుల మేర ప్రభుత్వానికి సేవలు అందిస్తున్న అన్నిరకాల ఉద్యోగులకు ఖచ్చితంగా ఎంతో కొంత వేతనాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింద‌ని సీఎం ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *