శ్రీ‌కృష్ణ‌రాయ‌బారం రెండోవ భాగం….

క్ష‌త్రియ ధ‌ర్మం ఇంత క‌ష్ట‌మైన‌దా? అయినా స్వ‌ధ‌ర్మాన్ని ఆచ‌రించ‌టం వ‌ల్ల వంశ‌నాశ‌నం క‌ల‌గ‌టం మాకు అభిమ‌తం కాదు. యుద్ధ‌మే జ‌రిగితే సంప‌ద ల‌భించ‌టంతో పాటు ప్రాణహాని కూడా క‌లుగుతుంది. ఒక్క‌డి చేతిలో ప‌లువురు ,దుర్బ‌లుని చేతితో బ‌ల‌వంతులూ స‌మ‌సిపోతారు. జ‌య‌ప‌జ‌యాలు అనిశ్చ‌యాలు. యుద్ధంలో అప‌జ‌యం మ‌ర‌ణంకంటే బాధాక‌ర‌మై గుండెను బ‌ద్ద‌లు చేస్తుంది. కాబ‌ట్టి క‌య్యం చేయ‌కుండానే ఉపాయంతో విరోధుల‌ను అణ‌చ‌క‌ల‌వారు సుఖంగా నిద్ర‌పోతాడు. వైర‌మే ఏప్ప‌డితే పాము ఉన్న ఇంట్లో కాపురం ఉన్న‌ట్లుగా ఉంటుంది. కాని మ‌న‌సుకు ఊర‌ట ల‌భించ‌దు. ఓకృష్ణా! ప‌గ‌ను అణ‌చివేయ‌టం ఎంతో శ్రేయ‌స్క‌రం.ప‌గ‌వ‌ల్ల ప‌గ స‌మ‌సిపోదు. ఒక‌డు వైరంతో బాధ‌క‌లిగిస్తే ఊర‌కుండ‌టం సాధ్యం కాదు. సాహ‌సించి శ‌త్రునిర్మూల‌న‌కు పూనుకొంటే క్రూర‌త్వానికి దారి తీస్తుంది.క‌నుక ఎంతో ఆలోచించినా ప‌గ‌వ‌ల్ల కీడే కాని మేలు లేదు. అందుచేత శాంతిని కోర‌ట‌మే కార్యం. యుద్ధం జ‌రుగ‌కుండా రాజ్య‌భారం పొందాల‌ని మేము కోరుతున్నాం. ధ‌న‌నష్టం, వంశ‌నాశ‌నం లేకుండా ఏదైనా ఉపాయం దొరికితే బాగుంటుంది. క‌దా!
మాప‌ట్ల ప‌క్ష‌పాతం చూప‌న‌వ‌స‌రం లేదు. ధ‌ర్మ‌మార్గంలో రెండు ప‌క్షాల‌కూ న్యాయం క‌లిగే విధంగా విదురుడు మున్న‌గు స‌జ్జనులు స‌మ్మ‌తించేట్లుగా స‌భ‌లో మెత్తగాను కఠినంగానూ మాట్లాడి కార్యాన్ని సాధించు కృష్ణా! దుర్యోధ‌నుడు అన్యాయంగా ప‌రుష‌వాక్యాలు ప‌లికితే స‌హించు. పెద్ద‌ల మాట విన‌లేద‌న్న అత‌డిపై ఉండ‌గా, భీష్మాది వృద్దుల మాట‌లు ఆద‌రించామ‌ని ప్ర‌జ‌లు మ‌న‌ల‌ను పొగుడుతారు. ధృత‌రాష్ట్రుడు కొడుకు ప‌క్షం వ‌హించి అవినీతికి పూనుకొంటే సంధి ఏమాత్రం పొస‌గ‌ద‌ని సాహ‌సించ‌వ‌ద్దు.ధ‌ర్మం ప‌ట్ల స్థిర‌బుధ్దితో అంద‌రూ మెచ్చుకొనేట‌ట్లుగా మా మ‌న‌సుకు చింత క‌లుగ‌ని విధంగా ఆచ‌రించు.ఇన్ని చిక్కుల‌తో విక‌ల‌మైన నా మ‌నోవ్యాధిబాపుట‌కు త‌గిన వైద్యుడ‌వు నీవే! ఇన్ని మాట‌లెందుకు? నీవు మ‌మ్మ‌ల్ని ఏ మార్గంలో న‌డ‌వ‌మంటావో అదే నాకు స‌మ్మ‌తం. అని ధ‌ర్మ‌జుడు ఇంకా అన్నాడు.కృష్ణా! నీవు దుర్యోధ‌నుని స‌భ‌కు వెళ్ల‌వ‌ద్ద‌ని కూడా నాకు అనిపిస్తుంది. అత‌డు అత‌ని మంత్రులునీ సంధిమాట‌ల‌ను పెడ‌చెవిని పెట్ట‌వ‌చ్చు. కుటిల మ‌తులు విన‌య‌హీనులు,క్రూరులు అయిన ఆ నీచుల వద్ద‌కు నిన్ను పంప‌జాల‌ను. నీకు కష్టం క‌లిగిచే ఇంద్ర‌ప‌ద‌వినైనా నేను ఇష్ట‌ప‌డ‌ను.
కాబ‌ట్టి నీవు కౌర‌వుల ద‌గ్గ‌రి ఒంటిరిగా వెళ్ల‌వ‌ద్దు.
ధ‌ర్మ‌రాజు మాట‌ల‌కు శ్రీ‌కృష్ణుడు ఇలా బ‌దులు ప‌లికాడు . దుర్యోధునుడొక్క‌డే కాదు ధృత‌రాష్ట్రుడు కూడా
నీవు చెప్పిన‌ట్టి వాడే. నీమాట నిజం. నీభావం నేను తెలుసుకొన్నాను. నేను నిజంగానేన ఆగ్ర‌హిస్తే ఆ స‌భ‌లో న‌న్నెదిరిచ‌గ‌ల‌వాడు ఒక్క‌డైన ఉన్నాడా? కాబ‌ట్టి నీమ‌న‌సులో శంక‌వ‌ద్దు. న‌న్ను కౌర‌వ స‌భ‌కు పంపించు.నేను వెళ్ల‌టం అన్నివిధాలా మంచిది. మ‌న కోరిక నెర‌వేరుతుంది. లేదా మ‌న‌కు పాపం క‌లిగించ‌ని మాట‌లు ప‌లుక‌టానికైనా వీల‌వుతుంది. అప్పుడు ధ‌ర్మ‌రాజు ఇలా వ‌చించాడు.
కృష్ణా! నీకు శుభ‌మ‌గుగాక‌, నీవు వెళ్ల‌టం యుక్త‌మ‌ని భావిస్తే వెళ్లివారూ మేము ఆనంద‌ముగా ఉండేట్లు అంగీకారం కుదుర్చు. సంధియే అన్ని విధాలా మ‌న‌కు మేలు . మా ఉభ‌య ప‌క్షాల గురించి నీకు బాగా తెలుసు. కూర్మి ఎటువంటిదో తెలుసు కార్య‌సాధ‌న ప‌ద్ధ‌తి మాట్లాడే తీరు ఎరిగిన‌వాడ‌వు. చెప్ప‌టానికి నేను ఎంత‌టివాడ‌ని?అన‌గా ముకుందుడు కౌర‌వుల దుర్నీతి గురించి ఇలా చెప్ప‌సాగాడు.
సంజ‌యుని రాయ‌బార‌మూ, నీ అభిప్రాయ‌మూ తెలిశాయి. నీవు ధ‌ర్మ‌బుధ్దివి. వారేమో ప‌గ‌తో ఉన్నారు. ద్రోణ భీష్ములు త‌మ‌వైపు ఉన్నార‌ని గ‌ర్వ‌స్తున్నారు. రాజ్య భోగం రుచిమ‌రిగిన వారు నీకు భాగం ఇస్తారా?
రాజులైన వారు యాచించి భుజించ‌టం భావ్యం కాదు. నీవు దైన్యాన్ని విడిచి యుద్ధం చేయి. శ‌త్రుజ‌యం వ‌ల్ల ఇహ‌ప‌ర‌సుఖాలు శాశ్వ‌త కీర్తి ల‌భిస్తాయి. గురువు,పితామ‌హుల స‌మ‌క్షంలో నిండు స‌భ‌లో ఆనాడు కౌర‌వులు తుచ్చులై మీకు అప‌కారం చేశారు. అంత త‌ప్పు చేసికూడా వారు ఎన్న‌డూ ప‌శ్చాత్తాపం ప్ర‌క‌టించ‌లేదు. అటువంటి వారి ప‌ట్ల కారుణ్య‌మూ బంధుత్వ‌భావ‌మూ విడిచిపెట్టు. ఆ దురాత్ముల గ‌ర్వ‌మూ, క్రౌర్య‌మూ చూసి ఎవ‌రైన కోపించ‌కుండా ఉంటారా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *