శ్రీ‌కృష్ణ‌రాయ‌బారం మూడో భాగం…

క‌ప‌ట జూదంలో మిమ్ము ఓడించి అడ‌వుల‌కు పంపిన‌పుడు దుష్ట చ‌తుష్ట‌యం(దుర్యోధ‌న‌, దుశ్శాస‌న‌, శ‌ల్య‌, క‌ర్ణులు) హేళ‌న‌తో మిమ్ము ఆడిన మాట‌లు నోటితో చెప్ప‌రానివి. అవి విన్న వారంతా ,ధృత‌రాష్ట్రుని దూషిస్తూ బ‌ల‌వంతులై ఉండికూడా స‌త్యానికి క‌ట్టుబ‌డి మీరు అడవుల‌కు వెళ్ల‌టం చూసి ఆశ్చ‌ర్య‌పోతూ దుఃఖించారు. నింద‌కు గురియైన వారు దైనం చేత ముందుగానే చెరుప‌బ‌డి ఉంటారు. వారిని చంప‌టం చాలా తేలిక. ఇంట్లో ఉన్న పాముల‌ను ఎలా వ‌ధిస్తారో అలాగే దుష్టులైన కౌర‌వులు కూడా మీకు చంప‌ద‌గిన‌వారే! మీ తండ్రి తాత‌ల ప‌ట్ల నీకు భ‌క్తి చూప‌టం ఉచిత‌మే కౌర‌వుల స‌భ‌కు వెళ్లి నీ విన‌య‌గుణాన్ని అంద‌రికీ చాటి చెబుతాను. అక్క‌డ మిత్రులు , బంధువులు,రాజులు అంద‌రూ వినేట‌ట్లుగా నీ ప‌విత్ర‌మైన న‌డ‌వ‌డినీ, ధ‌ర్మ మార్గాన్ని వివ‌రించి చెబుతాను.నా మాట‌లు అంగీక‌రించ‌కుండా దుర్యోధ‌నుడు అన్యాయంగా బ‌దులు ప‌లికినా, ధృత‌రాష్ట్రుడు అత‌డిని వారించ‌కుండా ఉదాసీనంగా ఉన్నా స‌భ‌లోని వారు ఆ కౌర‌వుల‌నే చీకొడ‌తారు. అంత‌కంటే మ‌న‌కు కావల‌సిందేముంది? నా శ‌క్తి కొద్దీ అన్ని విధాలా సంధికొర‌కే ప్ర‌య‌త్నిస్తాను. ఒక‌వేళ సంధి కుద‌ర‌క‌పోతే వారి ఆలోచ‌న‌లు, శ‌క్తి సామ‌ర్ధ్యాలు తెలుసుకొని మీకు విజ‌యం చేకూరేవిధంగా మ‌ర‌లి వ‌స్తాను. ఆ దుర్యోధనుడు ఊపిరి ఉన్నంత‌వ‌ర‌కూ నీకు రాజ్య‌భాగం ఈయ‌డు.యుద్ధం త‌ప్ప‌దు.యుద్ధ శ‌కునాలే క‌నిపిస్తున్నాయి. కాబ‌ట్టి నీవు ర‌ణోత్సాహాన్ని విడిచి పెట్ట‌కు. చ‌తురంగ బాలాల‌ను సిద్ధం చేసుకొంటూ, రాజుల‌ను పురికొల్పుతూ నీవు యుద్ధ స‌న్నాహంతోనే ఉండు. శ్రీ‌కృష్ణుడు చెప్పిన మాట‌లు విని భీమ‌సేనుడు అత‌నితో ఇలా అన్నాడు. యుద్ధం క‌లుగుతుంద‌ని మ‌మ్ము భ‌య‌పెట్ట‌వ‌ద్దు మాధ‌వా! దుర్బుద్ది అయిన దుర్యోధ‌నుడు శాంతించే మార్గాన్ని నీ మంచిత‌నంతో సాధించు. దురాత్ముడైన ఆ దుర్యోధ‌నుడు నీ మాట‌లు మ‌న్నించ‌డు.అహంకార క్రోధాల‌కు వ‌శుడైన అత‌డు త‌న ఆత్మీయుల‌ను కూడా క‌ష్ట‌పెడుతున్నావారు అత‌ని మాట‌కు అడ్డు చెప్ప‌లేక చూస్తూ ఊరుకొంటారు. కాబ‌ట్టి నిన్ను అత‌డు సంక‌టం పాలు చేయ‌గ‌ల‌డు. సుమా! ఆనీచుడు నేనున్న చోటికే వ‌చ్చి న‌న్ను చంపుతానంటూ నా ప‌రాక్ర‌మాన్ని లెక్క చేయ‌డు. అన్న ధ‌ర్మ‌రాజు, అర్జునుడు కురువంశ నాశ‌నానికి ఇష్ట‌ప‌డ‌రు. కాబ‌ట్టి అత‌డితో క‌లిసివుండ‌క త‌ప్ప‌టం లేదు. పాండ‌వ కౌర‌వులు పాలు, నీరు వ‌లె ప్రేమ‌తో క‌లిసిమెలిసి ఉండ‌గా అత‌డు దుష్ట‌చేష్ట‌ల‌తో ఆ స్థితికి కార‌కుడైనాడు. అత‌డొక్క‌డే వంశ‌నాశ‌నానికి కార‌కుడ‌వుతాడ‌ని పెద్ద‌లు చెప్పిన మాట పొల్లుబోదు. అయినా నీవు నేర్పుతోఅత‌డిని దారిలో పెట్ట‌టానికి ప్ర‌య‌త్నంచేయి. ఆ దుర్యోధ‌నుడు త‌న బొందిలో ప్రాణ‌మున్నంత వ‌ర‌కూ క్రౌర్య క‌ప‌టాల‌ను వ‌దిలిపెట్ట‌డు. కీర్తిమంత‌మైన భ‌ర‌త‌వంశం అప‌కీర్తి పాల‌వుతుంద‌న్న ఆలోచ‌న‌కూడా అత‌నిలో త‌లెత్త‌దు. అత‌డి మ‌న‌స్త‌త్వాన్ని అనుస‌రించి నీచ‌త్వానికి ద‌గ‌జారి అయినా సంధీ చేసుకొన‌ట‌మే మేలు, ఆ ధృత‌రాష్ట్రుని స‌భ‌లో మా ఉభ‌యుల‌కూ పితామ‌హుడైన భీష్ముని స‌మ‌క్షంలో దుర్యోధునునితో నా మాట‌లుగా ఇలా ,చెప్పు. మ‌నం అన్న‌ద‌మ్ములమై ఉండికూడా లోకులు ప‌రిహ‌సించే విధంగా ఒక‌రితో ఒక‌రు పోరాడ‌టం మంచిది కాదు.పెద్ద‌ల మాట ప్ర‌కారం రాజ్యాన్ని పంచుకొని హాయిగా ఉండ‌టం యుక్తం. అని చెప్పి ఏవిధంగానైనా సంధి కుదిరేటట్లు చూడు. మేమూ వారూ క‌లిసి ఉండ‌టం వ‌ల్ల లోకుల‌కు సుఖ‌మూ మేలూ చేకూర‌గ‌ల‌వు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *