ఆ ప్ర‌క్రియ నూత‌నంగా ఆరంభించండి -నాదెండ్ల‌మ‌నోహార్‌

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ‌త‌సంవ‌త్స‌రం నిలిచిన ద‌గ్గ‌ర నుంచి ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను కొన‌సాగించేలా రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ఉత్త‌ర్వులు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నిక‌ల‌కు గ‌త సంవ‌త్స‌రం మార్చి 11న నోటీఫికేష‌న్ విడుద‌ల‌య్యింది. మార్చి 11,12 తేదీల్లో నామినేష‌న్లు వేశారు. అయితే క‌రోనా నేప‌థ్యంలో మార్చి 16న నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ రోజే ఎన్నిక‌ల ప్ర‌క్రియ వాయిదాప‌డింది.ఏపీలో పుర‌పాల‌క ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను నిలిపివేసిన చోట నుంచే కొన‌సాగిస్తూ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం (ఎస్ ఈసీ) తీసుకున్న నిర్ణ‌యంపై జ‌న‌సేన అసంతృప్తి వ్య‌క్తం చేసింది. సంవ‌త్స‌రం క్రితం ఎన్నిక‌లు నిలిపివేసిన చోట నుంచి మ‌ళ్లీ కొన‌సాగించ‌డం స‌రికాద‌ని… తాజా ప్ర‌క్రియ ఆరంభించేందుకు ఉన్న అవ‌కాశాల‌ను ఎస్ఈసీ ప‌రిశీలించాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది. ఈ మేర‌కు జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల‌పై క‌మిటీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ ఓ వీడియో సందేశాన్ని విడుద‌ల చేశారు. కొవిడ మ‌హ‌మ్మారి కార‌ణంగా గ‌త సంవ‌త్స‌రం మార్చి15న ఎన్నిక‌ల వాయిదా నిర్ణ‌యాన్ని రాజ‌కీయ పార్టీగా తాము స్వాగ‌తించామ‌ని చెప్పారు. గ‌తంలో జ‌రిగిన నామినేష‌న్ల స‌మ‌యంలో అభ్య‌ర్థులు, ఓట‌ర్ల‌ను అధికార‌ప‌క్షం మ‌భ్య‌పెట్టింద‌ని ఆరోపించారు. ఆగిన‌చోట నుంచి మ‌ళ్లీ ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్రారంభించ‌డం ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధం కాబోద‌ని మ‌నోహ‌ర్ అభిప్రాయ‌ప‌డ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *