ఇండియా,చైనా సైనిక కమాండ‌ర్ల మ‌ధ్య నేడు కీల‌క చ‌ర్చ‌లు …

దిల్లీ: స‌రిహ‌ద్దుల్లో శాంతిస్థాప‌న దిశ‌గా ఇండియా,చైనా సైనిక కమాండ‌ర్ల మ‌ధ్య నేడు కీల‌క చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ద‌ఫా పురోగ‌తి చోటుచేసుకునే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. కోర్ క‌మాండ‌ర్ స్థాయిలో జ‌రిగే ఈ చ‌ర్చ‌ల‌కు తూర్పు ల‌ద్దాఖ్‌లోని చుషుల్ ప్రాంతంలో ఉన్న భార‌త శిబిరం వేదిక కానుంది. తూర్పు ల‌ద్దాఖ్‌లో గ‌త సంవ‌త్స‌రం మేల నెల నుంచి రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు చెల‌రేగి, వాస్త‌వాధీన రేఖ వెంబ‌డి ఇరు ప‌క్షాలూ భారీగా సైన్యాల‌ను మోహ‌రించిన విష‌యం తెలిసిందే. దీనిపై ఇప్ప‌టికే సైనిక‌, దౌత్య చ‌ర్చ‌లు జ‌రిగాయి. వీటికి అనుకూలంగా పాంగాంగ్ స‌రస్సు ఉత్త‌ర‌, ద‌క్షిణ రేవుల వ‌ద్ద రెండు దేశాలు బల‌గాల‌ను ఉప‌సంహ‌రించాయి. అయితే ఘ‌ర్ష‌ణ‌కు కేంద్ర బిందువులుగా ఉన్న మిగ‌తా ప్రాంతాల్లో సైనిక మోహ‌రింపు కొన‌సాగుతోంది. ఈ సంద‌ర్బంలో శుక్ర‌వారం జ‌రిగే 11వ విడ‌త కోర్ క‌మాండ‌ర్ల స‌మావేశంలో ప‌రిస్థితి మార్పున‌కు గ‌ట్టి ప్ర‌య‌త్నం జ‌రుగుతుంద‌ని సంబంధిత వ‌ర్గాలు ఇండియాకు తెలిపాయి. అది కార్య‌రూపం దాలిస్తే గోగ్రా లోయ, హాట్ స్ప్రింగ్స్‌,దెమ్‌చోక్‌లో ఉద్రిక్త‌త‌లు స‌డలి, ప్ర‌శాంత‌త నెల‌కొంటుంద‌ని వివ‌రించాయి. మ‌రోవైపు తూర్పు ల‌ద్దాఖ్‌లోని మిగ‌తా ప్రాంతాల్లో బ‌ల‌గాల ఉప‌సంహ‌ర‌ణ జరిగి, ద్వైపాక్షిక బంధం వృద్ధి చెందుతుంద‌న్న ఆశాభావాన్ని ఇండియా విదేశాంగశాఖ అధికార ప్ర‌తినిధి ఆరింద‌మ్ బాగ్చీ వ్య‌క్తం చేశారు. 11వ విడ‌త కోర్ క‌మాండ‌ర్ల భేటీ నిర్వ‌హ‌ణ‌లో ఎలాంటి జాప్యం జ‌ర‌గ‌లేద‌ని చైనా విదేశాంగ‌శాఖ అధికార ప్ర‌తినిధి ఝావో లిజియాన్ బీజింగ్ లో చెప్పారు. నిర్ధేశిత ఒప్పందాల‌కు అనుకూలంగా ఉద్రిక్త‌త‌ల‌ను త‌గ్గించుకునేందుకు ఇండియా త‌మ‌తో క‌లిసి పనిచేస్తుంద‌ని ఆశిస్తున్న‌ట్లు చెప్పారు. తూర్పుల‌ద్దాఖ్‌లో గ‌త సంవ‌త్స‌రం ఏప్రిల్ నాటి
ప‌రిస్థితుల‌ను పున‌రుద్ద‌రించాల‌న్న ఇండియా విజ్ఞ‌ప్తిపై నేడు నాటి కోర్ క‌మాండ‌ర్ల భేటీలో చ‌ర్చించే అవ‌శాం ఉంద‌ని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *