ప్ర‌తిష్ఠాత్మ‌క అంత‌ర్జాతీయ స‌ద‌స్సుకు కేటీఆర్‌…

హైద‌రాబాద్ః జ‌పాన్‌లో నిర్వ‌హించ‌నున్న ప్ర‌తిష్ఠాత్మ‌క అంత‌ర్జాతీయ స‌ద‌స్సుకు తెలంగాణ ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. ఏప్రిల్ 5 నుంచి 7వ‌ర‌కు జ‌పాన్ రాజ‌ధాని టోక్యోలో నిర్వ‌హించ‌నున్న ప్ర‌పంచ టెక్నాల‌జీ గ‌వ‌ర్నెన్స్-2021 స‌ద‌స్సుకు హాజ‌రుకావాల్సిందిగా… వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోరం అధ్య‌క్షుడు బోర్గ్ బ్రెండే కేటీఆర్ కు లేఖ రాశారు. వివిధ దేశాల‌కు చెందిన ప్ర‌భుత్వాధినేత‌లు, మంత్రులు, వ్యాపార ,వాణిజ్య రంగాల ప్ర‌ముఖులు ఈ స‌ద‌స్సులో భాగ‌స్వాములు కానున్నారు. క‌రోనా సంక్షోభం నుంచి ప్ర‌పంచ‌దేశాలు వృద్ధి బాట ప‌ట్టేందుకు ఎమ‌ర్జింగ్ టెక్నాల‌జీల వినియోగం అనే అంశంపై ఈ స‌ద‌స్సులో ప్ర‌ధానంగా చ‌ర్చించ‌నున్నారు. నూత‌న సాంకేతిక‌త వినియోగం ద్వారా ప్ర‌భుత్వ, ప్రైవేట్ భాగ‌స్వామ్యాల బ‌లోపేతం, అందులో ఎదుర‌య్యే స‌వాళ్ల‌ను అధిగ‌మిస్తూ వృద్ధి సాధించ‌డం లాంటి కీల‌క అంశాల‌పై ఈ స‌భ‌లో మాట్లాడ‌నున్నారు. గ‌తేడాది ప్ర‌పంచ ఆర్థిక వేదిక స‌ద‌స్సు కోసం నాలుగు రోజుల‌పాటు స్విట్జ‌ర్లాండ్‌లోని దావోస్‌లో కేటీఆర్ ప‌ర్య‌టించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా పారిశ్రామిక‌వేత్త‌లు, ప‌లు కంపెనీల అధిప‌తులు, వివిధ దేశాల ప్ర‌తినిధుల‌తో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర విధానాలు, పెట్టుబ‌డుల‌కు ఉన్న అవ‌కాశాల‌ను వారికి కేటీఆర్ వివరించారు.గ్లోబ‌ల్ టెక్నాల‌జీ గ‌వ‌ర్నెన్స్ స‌ద‌స్సుకు మంత్రి కేటీఆర్ వెళ్ల‌డం ద్వారా తెలంగాణ‌కు ప్ర‌పంచ వేదిక‌పై
మ‌రోసారి గుర్తింపు ద‌క్క‌నుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *