ఓటు హ‌క్కును గౌర‌వించ‌డం చాలా ముఖ్య‌మ‌న్నారు..

న్యూఢిల్లీ : ఓటు హక్కును గౌరవించడం చాలా ముఖ్యమని, ఓటు హక్కును సంపాదించుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు కష్టాలు పడ్డారని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. సోమవారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా భారత ఎన్నికల కమిషన్‌ వర్చువల్‌గా నిర్వహించిన కార్యక్రమంలో రామ్‌నాథ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘విలువైన ఓటు హక్కును ఎల్లప్పుడూ గౌరవించాలి. ఓటుహక్కు సాధారణ హక్కుకాదు. దీని కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అనేక కష్టాలు పడ్డారు’ అని కోవింగ్‌ పేర్కొన్నట్లు రాష్ట్రపతి భవన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఓటు హక్కును చిత్తశుద్ధితో ఉపయోగించుకోవడం అందరి, ముఖ్యంగా యువతి బాధ్యత అని రాష్ట్రపతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ముందుగా కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ కొత్తగా నమోదైన ఓటర్లకు డిజిటల్‌ ఫోటో గుర్తింపు కార్డులను అందచేశారు. ఓటర్ల జాబితాలో ఉన్న అందరు ఓటర్లు తన ఎలక్టార్స్‌ ఫోటో ఐడెంటిటీ కార్డ్స్‌ (ఈపిఐసి) సంఖ్యలతో ఈ డిజిటల్‌ ఓటర్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అలాగే 2020 నవంబర్‌ా డిసెంబరులో దరఖాస్తు చేసిన వారు సోమవారం నుంచే తమ డిజిటల్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ సునీల్‌ ఆరోరా, ఎలక్షన్‌ కమిషనీర్లు సుశీల్‌ చంద్ర, రాజీవ్‌ కుమార్‌ పాల్గన్నారు. ఎన్నికలు నిర్వహించడానికి సహకారం అందించిన అధికారులు, పౌర సంఘం సభ్యులకు ఎన్నికల కమిషన్‌ అవార్డులు అందించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *