సీఎం కేసీఆర్ తీసుకున్న కీల‌క నిర్ణ‌యాల‌పై బీజేపీ నాయ‌కురాలు విమ‌ర్శ….

హైద‌రాబాద్ః తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజెపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి మ‌రోసారి త‌న‌దైన శైలిలో సెటైర్లు వేశారు. సీఎం కేసీఆర్ కురిపిస్తున్న వ‌రాల జ‌ల్లు చూస్తుంటే రాత్రికి రాత్రే రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేయాల‌ని చూస్తున్న‌ట్టు క‌నిపిస్తోంద‌ని ఎద్దేవాచేశారు. ఉద్యోగాల భ‌ర్తీ, ఫిబ్ర‌రిలో పీఆర్సీ, ప్ర‌మోష‌న్లు, బ‌దిలీలు, సాగుచ‌ట్టాల‌కు సై అన‌డం, ఎల్ఆర్ ఎస్‌పై వెన‌క్కిత‌గ్గ‌డం… ఇలా గ‌త నాలుగైదు రోజులుగా కేసీఆర్ చేస్తున్న ప్ర‌క‌ట‌న‌ల మ‌ర్మ‌మేంటో ఎవ‌రికీ తెలియ‌ద‌నుకుంటే పొర‌పాటే అని విజ‌య‌శాంతి వ్యాఖ్యానించారు. గ‌డ‌చిన టీఆర్ఎస్ ఆరేళ్ల పాల‌న‌లో జ‌నం గుండెలు బాదుకున్న ప‌ట్టించుకోని స‌మ‌స్య‌ల‌పై ఇప్పుడు ఒకొక్క‌టిగా దృష్టి సారిస్తుండ‌టం వెనుక కుట్ర కాక ప్ర‌జా సంక్షేమం ఉంద‌ని ప్ర‌జ‌లు న‌మ్మే ప‌రిస్థితుల్లేన‌ని విజ‌య‌శాంతి విమ‌ర్శించారు. దుబ్బాక‌, జీహెచ్ఎంసీ ఫ‌లితాలు ప్ర‌భుత్వ అధినేత అహంకారాన్ని కొంత దారికి తెచ్చిన‌ట్లు అనిపిస్తుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఇలాంటి
ప‌రిణామాలే వ‌రంగ‌ల్ ,ఖ‌మ్మం కార్పొరేష‌న్లు, రాబోయే ఉప ఎన్నీక‌ల్లోనూ వ‌స్తే… సీఎం కేసీఆర్ ఎంతో కొంత జ‌న సంక్షేమం గురించి క‌నీసం ఆలోచిస్తార‌ని అన్నారు. అంతేకాకుండా మంత్రుల‌కు, ఎంపీల‌కు, ఎమ్మెల్యేల‌కు, ఎమ్మేల్సీలు, ఎన్నికైన ప్ర‌జాప్ర‌తినిధుల‌కు విలువ‌, స‌మ‌యం, అపాయింట్‌మెంట్లు ఇచ్చి ప్ర‌జా స‌మస్య‌ల‌పై కొంత దృష్టి పెట్టే ప్ర‌య‌త్నం జ‌ర‌గ‌వ‌చ్చ‌ని పేర్కొన్నారు. అందుకోస‌మైనా త‌దుప‌రి ఎన్నిక‌ల ముందువ‌ర‌కూ కొంత‌కాలం అధికారంలో ఉండే ఈ టీఆర్ ఎస్ ప్ర‌భుత్వానికి, ప్ర‌తి సంద‌ర్భంలోను ఓట‌మి రుచి చూసించ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉంద‌ని తెలంగాణ స‌మాజం అభిప్రాయ‌ప‌డుతోంద‌ని విజ‌య‌శాంతిఅన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *