జ‌న‌సేనాని మెట్రో ప్ర‌యాణం…

క‌రోనా స‌మ‌యం నుండి త‌న ఫాంహౌజ్‌కి ప‌రిమితం అయిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. గురువారం ఉద‌యం హైద‌రాబాద్ మెట్రో రైలులో ప్ర‌యాణం చేశారు. మాదాపూర్ మెట్రో స్టేష‌న్ నుంచి మియాపూర్ వ‌ర‌కు ప్ర‌యాణించారు. శ్రీ‌ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు వ‌కీల్ సాబ్ షూటింగ్ నిమిత్తం మియాపూర్ వెళ్లారు. సాధార‌ణ ప్ర‌యాణికుడిలా మెట్రో స్టేష‌న్ లో చెకింగ్ ప్ర‌క్రియ‌ను, ఎంట్రీ విధానాన్ని పాటించారు. ఈ మెట్రో ప్ర‌యాణంలో భాగంగా అమీర్ పేట స్టేష‌న్లో ట్రైన్ మారారు ఈ సంద‌ర్భంలో తోటి ప్ర‌యాణికుల‌తో సంభాషించారు. మియాపూర్ వెళ్లే ట్రైన్ లో శ్రీ‌ప‌వన్ క‌ళ్యాణ్ గారి ప‌క్క‌న ద్రాక్షారామం,స‌త్య‌వాడ ప్రాంతాల వారు కూర్చున్నారు. ద్రాక్షారామం చెందిన శ్రీ చిన స‌త్య‌నారాయ‌ణ అనే రైతుతో మాట్లాడారు. పంట‌ల గురించి, ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. శ్రీ చిన స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ ఇటీవ‌లి వ‌ర్షాల‌కు వ్య‌వ‌సాయం బాగా దెబ్బ‌తింది అని చెప్పారు. త‌మ ప్రాంతంలోనూ, కుటుంబంలోనూ చాలా మంది మీ అభిమానులు ఉన్నారు. ఈ ప్ర‌యాణంలో మిమ్మ‌ల్ని క‌ల‌వ‌డం చాలా సంతోషంగా ఉంది అని ఆనందం వ్య‌క్తం చేశారు. మెట్రో ట్రైన్ ప్ర‌యాణం త‌న‌కు మొద‌టిసారి అని ఆ రైతు చెప్ప‌గానే ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు న‌వ్వుతూ మీకే కాదు నాకు కూడా మెట్రో ప్ర‌యాణం ఇదే మొద‌టిసారి అని అన్నారు. ఈ ప్ర‌యాణంలో శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారి వెంట చిత్ర నిర్మాత శ్రీ దిల్‌రాజు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *